ఆంధ్రసాహితి
ఆంధ్ర విశ్వకళాపరిషత్ ప్రారంభ కాలంలో ఏర్పాటైన శాఖలలో తెలుగుశాఖ ఒకటి. అప్పటి నుండి ఇప్పటివరకూ ఆంధ్ర విశ్వకళాపరిషత్కు కీర్తి ప్రతిష్టలు తెచ్చిన మహామహులను గమనిస్తే అందులో తెలుగుశాఖాచార్యులుకూడా ఉండటం విశేషం. తెలుగుభాషకు, సాహిత్యానికి ఎనలేని సేవ చేసిన అతిరథ మహామహులు ఈ శాఖలోఆచార్యులుగా పనిచేశారు. పింగళి లక్ష్మికాంతంగారు, తుమాటి దొణప్పగారు, కె.వి.ఆర్ నరసింహంగారు, యస్వీజోగారావుగారు, కొర్లపాటి శ్రీరామమూర్తిగారు, లకంసాని చక్రధరరావుగారు ఇలా అనేక మంది ప్రముఖులుతెలుగు భాష ఔన్నత్యాన్ని చాటారు. ఎన్నో విలువైన పరిశోధనలు ఈ శాఖ నుండి జరగటం మరో విశేషం. అయితే వివిధ సందర్భాల్లో ప్రత్యేక సంచికలు ద్వారా ఆయా పరిశోధనలు ప్రచురించబడినా, పూర్తి స్తాయిలో నడిచే పత్రికంటూ ఒకటి లేకపోయింది. జరుగుతున్న పరిశోధనలు, వాటి విలువలు, ఫలితాలు అందరికీ తెలియజేయాలంటే ఒక ప్రామాణికమైన పత్రిక అవసరం అని తెలుగుశాఖ వారు గుర్తించి ప్రిన్స్పాల్ గారి సలహాతో పత్రికను
నడపాలని నిర్ణయానికొచ్చి ‘ఆంధ్ర సాహితి’ అనే పత్రికను ఏర్పాటు చేయడం జరిగింది. భాష, సాహిత్య, సాంస్కృతికాధ్యయనాలకు నిలయమైన ఈ పత్రికను వ్యవహారిక భాషోధ్యమ నాయకుడైన గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి రోజు అనగా తెలుగు భాషా దినోత్సవం రోజున ప్రారంభించాం. ఈ పత్రిక మూడు నెలలకు ఒకసారి ప్రచురించి భావి పరిశోధకులకు ఉపయోగకారంగా ఉండేలా తీర్చిదిద్దాలని భావిస్తున్నాం. విలువైన పత్రాలు ముద్రించి ఆయా పరిశోధన విలువలను సాహితీలోకానికి అందించాలనే మా తపనకు ప్రతి ఒక్కరి సహాకారం అవసరం. పరిశోధకులతో పాటు, ఆచార్యులు కూడా ఈ పత్రికలో భాగస్వాములు కావడం హర్షనీయం. ఆంధ్ర విశ్వకళాపరిషత్ మరియు అందలి తెలుగుశాఖ ప్రాశస్త్యాన్ని తెలియజేయడమే కాకుండా తెలుగు భాష, సాహిత్య, సాంస్కృతికపరమైన ఔన్నత్యాన్ని రాబోయే తరాలకు అందించడానికి ఉపకరించే ఈ పత్రికను ఆదరిస్తారని కోరుతున్నాం.
….. సంపాదక వర్గం